Tuesday, March 28, 2017

ఎలా దగ్ధం చేసుకోను?

ఈ పిడికెడు గుండెను
ఎలా దగ్ధం చేసుకోను?

కొన్ని సమూహాల సామూహిక
దహనకాండ మధ్య

కొన్ని ఆకులు రాల్చిన అరణ్యాల
మంటల చివుళ్ళ మధ్య

పాయలుగా చీలి ఇగిరిపోతున్న
నదీ ప్రవాహాల నడుమ

ఈ కన్నులు రాల్చిన నెత్తరంటిన
పిడికెడు గుండెను
ఎలా దగ్ధం చేసుకోను?

తెగిపడిన తల నవ్వుతూ
రేపటిని కలగా
వాగ్దానమిస్తూన్న వేళ

అరచేతుల మధ్య
ఈ పిడికెడు గుండెను
ఎలా దగ్ధం చేసుకోను??

Saturday, December 24, 2016

కొన్ని దృశ్యాలు!!

కొన్ని పేజీలను
నీకంటూ రాసుకుంటావ్!

కానీ
ఆఖరు పేజీ చిరిగి
నువ్వంటూ
కనబడవేం?

వద్దింక
సరిహద్దులు
చెరిపేయి!

ఖాళీ
నల్లరంగు సిరాబుడ్డీ
వెక్కిరిస్తూ!

చినిగిన కాగితప్పడవ
మునకలో
కొన్ని నీటి బిందువులు!

ఆ వీధి మలుపులో
ముసలి అవ్వ
చేతులు ఖాళీగా!

చలినెగడు చుట్టూ
పరచుకున్న రగ్గులు
ముడుచుకుంటూ!!

(Dec.22.2016)

Wednesday, December 14, 2016

ఆ ఇంటి గుమ్మం


వెళ్ళిన వాళ్లు తిరిగి వస్తారని ఆ ఇంటి
గుమ్మం ఎదురు చూస్తోంది

వాళ్ళేదో కోట్లకొద్దీ రూపాయి మూటలు
మోసుకొస్తారని కాదు

వాళ్ళేదో బంగారపు గనులు
తవ్వుకొస్తారని కాదు

వాళ్ళేదో తాను పడుతున్న ఈతిబాధలన్నీ
తీరుస్తారనీ కాదు

వాళ్ళేదో మేడ మీద మేడలు
కడతారనీ కాదు

వాళ్ళేదో సిరిమంతులయి ఊరిని
దత్తత తీసుకొంటారని కాదు

కానీ వాళ్ళింక రారని  సిమెంటు కాంక్రీటు
కింద మాంసపు ముద్దలయ్యారని తెలవక

ఆ ఇంటి గుమ్మం రెండు కళ్ళు తెరచుకొని
ముంగాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ఎదురు చూస్తోంది!!

(నానక్ రాంగూడలో కూలిన ఉత్తరాంధ్ర  వలస బతుకులకు కన్నీటితో)

Thursday, October 20, 2016

మరల కథ పాతదే!


వింటావా!
ఇంటికి చేరుతున్న వేళ దారిలో
గూడు నుండి జారి రెక్క విరిగిన పక్షి ఒకటి
చేతిలో పడింది
సున్నితమైన తన దేహం నా రాతి వేళ్ళ మధ్య
బాధగా మూలిగింది
ఒక దు:ఖాశృవు జారి తన రెక్కలను తడిపింది
ఒక మాట చెప్పనా
మరల మరల వెంటాడే
వేటగాడెవడో పొంచి వుండి చల్లిన
బియ్యపు గింజలు ఎప్పుడూ
గొంతుకడ్డం పడతాయి కదా?
కంటిలో పడిన ఇసుక రేణువు
గరగరలాడుతూ మసకబారింది పొద్దు
పిల్లలనెత్తుకు పోతున్న దొరలు తిరుగుతున్నారంట
తెలవారితే ఆ మడిచెక్కనెవరో తవ్వుకుపోతున్నారంట
ఉలికిపడకు ఇప్పుడంతా ఎవరి నిద్రలో వారు నటిస్తారంట
కలలు ఎవరి రెటినాపైనా ప్రతిఫలించని తీరు
కాసేపిలా ఒదిగి నిదురపో
రేపు ఈ కథ పాతదవుతుందిలే!!

Wednesday, October 12, 2016

కరిగేనా??

ఒకసారి మాటాడుకుందాం
నువ్ నీలా నేను నాలా


ఈ చెరగని గీతల మధ్య
ఒకింత ఒరిపిడి రాజుతూ


గుండె దాటని మాటని
గొంతు పెగులుతుందా? 


కొన్ని ప్రశ్నలు అలాగే
కొక్కెంలా వేలాడుతూ వెక్కిరిస్తూ


ఇసుకలా గరకుగానో కరకుగానో
తగులుతూ అడ్డంగా ఏదో 


ఎదురెదురుగా నిలిచిన
రాతితనం కరిగేనా? 


ఎన్ని
చినుకులు
రాలినా!!


(26/09/2016-7.54pm)

ముద్ర..

నిర్వచించలేని
క్షణాలేవో
ఒదిగి
ఒంటరిగా
ఆవిరికావడం
విరామమా?
విషాదమా?

ఒక
నిశాని
నిశిరాతిరి
ఇలా ముద్రగా! 

రాత్రిని
ఎగరేసుకుపోయే
మేఘమేదో
కమ్ముకుంటూ!

నువ్వంటావు
ఉదయం
వుందా అని?

ఒడ్డున
వొరుసుకు
పోతున్న
ఇసుక
గూడు
చూడు

వెచ్చని
బిందువు
తాకుతూ!!

Thursday, August 25, 2016

సారంగలో నా కవిత "ఎరువు"

 satya2
వంచిన నడుం ఎత్తకుండానే
కమ్మిన మబ్బుకుండ ఒట్టిపోయి
నాటిన నారు నీరిగిరిన మడిలొ
విలవిలలాడుతుంటే
నెత్తురు చిమ్మిన కళ్లు!

వానా వానా వస్తావా
ఈ నేల దాహం తీర్చుతావా!

ఆశలన్ని మొగిలికి చేరి
ఆవిరింకిన కనులలోకి
కాసింత తడి చేరుతుందా!

వాడు నలుదిక్కులా వేసిన
కార్పెట్ బాంబింగ్ పొరల పొరలుగా
బద్ధలై పచ్చదనంతో పాటు పసిపాపలను
హరించి ఇప్పడీ హరిత వనం కోతలు కోస్తున్నాడు!

నేలతల్లి నవ్వులు విరబూసేలా
నువ్వూ నేను కలిసి
ఓ మొక్క నాటుదాం
ఎరువుగా వాడినే పాతుదాం!!

Sunday, August 14, 2016

ఎవరో...


 ఒకరెవరో ఏమవుతారో
అలా ఒకసారి కరచాలనమిస్తారు
ఒక మాట కలుపుతారు
మరల మరల
కలుసుకోవాలని
కలబోసుకోవాలని
వెన్నాడుతూ ఉంటుంది!

అయినా
మరల ఒక కలయిక
కలగానే మిగిలి
ఒక రాతిరిని కొన ఊపిరిగా
రెక్కలూడిన తూనీగలా
మిగిలిపోనిస్తుంది కదా!

ఒక ఆశ వెన్నాడుతూ
నీ గుండె జోలెలో
ఖాళీగా వెక్కిరిస్తూ
వెను తిరిగి చూస్తే
ఒక ముక్కలైన స్వప్నమేదో
పగిలిన అద్దంలో!!
Related Posts Plugin for WordPress, Blogger...