Saturday, May 24, 2014

దేహాన్ని విరమించిన వేళ..


దీపస్తంభాన్నెవరో ఎత్తుకు పోయినట్టున్నారు 
ఈ గోడ చీకటి నీడ కప్పుకుని వుంది
కాళ్ళు రెండూ ముడుచుకుని డొక్కలోకి తన్నిపెట్టి ఆకలిని చంపుతూ 

చినిగిన దుప్పటి యింత వెన్నెలను లోపలికి చొరబెడుతూ 
చల్లని స్పర్శనేదో ఒకింత పులుముతున్నట్టుంది
చిన్నగా మెలకువని మింగి ఏదో మగతనిద్రలో కలవరిస్తూ

దేహాన్ని విరమించిన వేళ కాసింత విశ్రాంతిని మిగిల్చి
ముసురుకున్న కలల కత్తి అంచు మీద మనసు నాట్యం చేస్తూ
ఊపిరి స్వరం నెమ్మదిగా చివరి వత్తినంటిన చమురులా

ఈ అసంపూర్ణ పద్యాన్నిలా కత్తిరించి కాసేపు 
గాలిపటంలా ఎగరేసి తోకచుక్కను తాకాలని 
ఓ అసహజ ప్రయత్నమేదో చేయబూనుతూ 

Wednesday, May 14, 2014

అలసినతనం,,,

నల్లగా యింత మట్టి మొఖం మీద ఏవో స్పష్టాస్పష్ట ముడుతలను కప్పుకుంటూ

రేఖా మాత్రంగా మిగిలిన చారికలేవో ఉప్పుపేలి తెల్లగా

ఊపిరాడనీయని ఉక్కపోతతో దేహమంతా అలసినతనమేదో కమ్మి ఒకింత విశ్రాంతిని కోరుతూ

నువ్వంటావు కాసిన్ని నీళ్ళు ఒంపుకోరాదూ అని

నాకేమో ఆ ఎండిన ఆకుపై చినుకు పడితే చూడాలని వుంది

కాలమిలా బందిఖానాలో మగ్గి విరిగిన పాళీ అతికితే బాగుణ్ణు కదా అని వేచి చూస్తున్నా

రాదంటావా మరలా ఈ క్షణం..

పోనీ కోల్పోయినవన్నీ ఈ సమాధి రాళ్ళ మధ్యలో మొలిచిన గడ్డి పరకలలా మొలకెత్తుతూనే వున్నాయి కదా!

Sunday, May 11, 2014

ఖాళీ కాగితం...


సర్లే ఈ రాత్రికి యింక ఏమీ రాయలేవు
కాసిన్ని అక్షరాలు నీ నుండి దూరమయి 
మసక వెన్నెల కమ్ముకుని 
ఏదో చీకట్లో బర బరా గీకేసి పోకపోతే నష్టమేముంది??

రాయాలన్న కాంక్షో మోహమో నిన్ను వీడక 
ఏదో తాపత్రయమెందుకు 
నువ్ రాయకపోతే భూమేమైనా తూర్పు నుండి పడమర తిరుగుద్దా??

వదిలేయిరా ఈ కాలాన్నింక నీ ఆగిన వాచీ ముళ్ళ మద్య
కాసింత నలుపు చేయక తెల్లగా మెరవనీయ్ ఈ కాగితాన్ని 
కసిగా నువ్ నలిపి వుండ చుట్టి పారేసిన పదాలేవో 
రేపు మెరవక మానవు మరొక సారి!!

Saturday, May 3, 2014

తడి అంటిన పూలు...


కొన్ని వాక్యాలకు ఫుల్ స్టాపులుండవు
కొన్ని పరిచయాలకు ముగింపులుండవు


కొన్ని గాయాలు చికిత్సకందవు
కొన్ని కరచాలనాలు మరపురావు


కొన్ని మాటలకు శబ్దముండదు
కొన్ని పాటలు గొంతు దాటి రావు


కొన్ని క్షణాలు ఊపిరినిస్తాయి
కొన్ని సమయాలు పరిమళిస్తాయి


కొన్ని జీవితాలు దుఖాంతమవుతాయి
చివరిగా తడి అంటిన పూలు సమాధిని తాకుతాయి

Friday, May 2, 2014

అనావృతం...



ఎప్పుడూ నువ్వేసే ప్రశ్న వెంటాడుతూనె వుంటుంది
గాయాల సలపరమేనా కవిత్వం
నీ వూహల్లోనైనా నే లేనా?
నాకోసం ఇన్ని పూలూ యింత గంధం అద్దిన
ఒక్క మాటైనా రాయలేవా? 
అని...

నిజమే కదా
పూరెమ్మలకంటిన నెత్తురు
గంధం పరిమళాన్నివ్వలేదు కదా!

పగిలిన ముఖం అద్దంలో చూపలేక 
దాగిన వెన్నెల!

ఆకాశం అంచు నేలను తాకిన చోట
చేతి వేళ్ళ కొసలనుండి
జాలువారే సెలయేటి నీళ్ళ స్పర్శను
నీవందుకోలేవింక!

దూరంగా నెట్టి పోయిన స్నేహం 
గుండెకింత రంపపు కోతనే మిగిల్చిన క్షణం
రెక్క తెగిన పావురంలా యిలా!
Related Posts Plugin for WordPress, Blogger...